
cm jagan tribute to potti sriramulu
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన సంస్కృతిని, మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలు, విజయాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆంధ్ర నేలపై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలతోనే మనకు రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఆ మహానుభావులందరినీ స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమన్నారు.
అనంతరం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. అలాగే పోలీసులు అందించిన గౌరవ వందనాన్ని సీఎం జగన్ స్వీకరించారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదామని ముఖ్యమంత్రి ప్రజలందరికీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్. లక్ష్మీపార్వతి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజ విజయసాయిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జెండాకు వందనం చేశారు.