
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని, అర్హత లేనివారినీ చేర్పించాలని మంత్రులు కూడా చెబుతున్నారని, దీన్ని అరికట్టాలని, సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల వ్యవస్థపై ప్రభావం పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెల్లి విల్సన్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి ఎన్నికల అక్రమాలపై వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ . ఎన్నికల్లో అక్రమాలకు సహకరించలేదనే పేరుతో నెల్లూరు, అనంతపురం డిఇఓలను బదిలీ చేశారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని పేర్కొన్నారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని వారి బదిలీలను వెంటనే ఆపాలని డిమాండు చేశారు. ఏ మాత్రమూ అర్హతలేని, ఉపాధ్యాయులు కానివారినీ ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. కాదంటే మంత్రులే బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు.
వాలంటీర్లు కూడా సర్వే పేరుతో ఇంటింటికీ తిరిగి అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని, వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ కోరారు. ఎక్కడా టీచర్లుగా లేనివారిని, ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న కొద్దిమందిని టీచర్లుగా చూపించి దీనికి అవసరమైన సంతకాలు చేయాలని డిఇఓలపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఇటువంటి బెదిరింపు చర్యలను వెంటనే నిరోధించాలని కోరారు. లేనిపక్షంలో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు నకిలీ ఓటర్లుగా చేర్చిన వారిని వెంటనే తొలగించాలని కోరారు.
అలాగే దొంగ ఓట్లను చేర్పించే విధంగా ప్రొత్సహిస్తున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని, వారు ఇక ముందు బహిరంగ ప్రకటనలు చేయకూండా చూడాలని కోరారు.
కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం : మీనా
దొంగ ఓట్ల చేర్పింపులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశామని, అలాగే డిఇఓల బదిలీలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మరో లేఖ రాశామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే అదేశాల మేరకు తగ్గిన చర్యలు తీసుకుంటామని మీనా తెలిపారు.