
AP Decentralization movement
దేశానికే దగద్ధాయమానంగా నిలిచే రాజధాని నగరాన్ని అమరావతిలో నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు.. కనీసం సాదాసీదా నగరాన్ని కూడా నిర్మించలేకపోయారు. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాలు నిర్మించారు తప్పితే.. అంతకుమించి చేసిందేమీ లేదు. విజనరీ లీడర్‌గా చెప్పుకునే చంద్రబాబు విజన్ అమరావతి విషయంలో అట్టర్ ఫ్లాప్ అని రుజువైంది. ప్రత్యామ్నాయంగా జగన్ సర్కార్ మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఏర్పాటే సరైన మార్గమని వైసీపీ విశ్వసిస్తోంది. ఇందుకు ప్రజా మద్దతు కూడా పెరుగుతోంది. ఉత్తరాంధ్ర గడ్డపై జేఏసీ పురుడు పోసుకున్న తర్వాత ఇప్పుడు గ్రామాలన్నీ వికేంద్రీకరణకు జై కొడుతూ కదులుతున్నాయి.
ఎగిసిపడుతున్న వికేంద్రీకరణ ఉద్యమం
వికేంద్రీకరణకు జై కొడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువత, మేదావులు, ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చారు. విశాఖ జిల్లాలోని పలుచోట్ల మానవహారాలు నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీ సంఘాలు కూడా వికేంద్రీకరణకు మద్దతుగా గొంతెత్తాయి. ఈ మేరకు గోపాలపట్నం ప్రధాన రహదారిలోని మసీదు వద్ద భారీ ప్రదర్శన చేపట్టారు. పెందుర్తి, వేపగుంట, గాజువాక ఇలా తదితర ప్రాంతాల్లో మూడు రాజధానులకు మద్దతుగా కార్యక్రమాలు జరిగాయి.
అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో గత ఐదు రోజులుగా వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన దీక్షలు బుధవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జన ర్యాలీకి ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లోనూ వికేంద్రీకరణకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వికేంద్రీకరణకు మద్దతుగా స్థానికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
తగ్గేది లేదంటున్న ఉత్తరాంధ్ర..
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన జరగబోతున్న వేళ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు స్వరం పెంచారు. ఉత్తరాంధ్రులది బతుకు పోరాటమని… విశాఖను రాజధానిగా చేసేందుకు అడ్డుపడేవారు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు అమరావతి రైతుల పాదయాత్రపై నిప్పులు చెరిగారు. రైతుల పేరుతో ఒళ్లు బలిసినవాళ్లు చేస్తున్న యాత్ర అది అని విమర్శించారు. ఈ కుట్రలను పసిగట్టి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమవుతారని అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందించారు. విశాఖ గర్జన ప్రత్యర్థుల గుండెల్లో గునపంలా దిగుతుందన్నారు. మా తలలు తెగిపడినా సరే విశాఖ రాజధాని కోసం వెనుకడుగు వేయమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ ముందుకెళ్తామని హెచ్చరించారు.
విశాఖ గర్జన పోస్టర్
విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు జేఏసీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తాజాగా విశాఖ గర్జన పోస్టర్‌ను జేఏసీ సభ్యులు ఆవిష్కరించారు. జెండాలు, అజెండాలను పక్కనపెట్టి ప్రజలంతా వికేంద్రీకరణకు మద్దతుగా తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మూడు రాజధానులను వ్యతిరేకించే ఉత్తరాంధ్ర నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం :
వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న పోలీసులు యువకుడిని అడ్డుకోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజానీకంలో వికేంద్రీకరణ పట్ల ఎంత బలీయమైన కాంక్ష నెలకొందో ఈ ఘటనతో అర్థమవుతోంది.