
raghurama krishnam raju
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ షాకిచ్చింది. హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరవ్వాలంటూ ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రఘురామ ఆరోపణలు ఎందుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లుగా విచారణను వాయిదా వేసుకుంటూ వస్తున్న రఘురామకు సీఐడీ మరోసారి నోటీసులు పంపింది.
అయితే తాజాగా తనకు అందిన నోటీసులపై రఘురామ స్పందించారు. తాను ఈ నెల 16వ తేదీనే సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. తనతో పాటు రెండు టీవీ ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా.. తనకొక్కడికే నోటీసులు ఇవ్వడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నే తాను సీఐడీ అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు.
అంతకు ముందు ఏం జరిగింది?
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా మీడియాలో వ్యాఖ్యలు చేసిన కేసులో రఘురామ ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఈ కేసులో రఘురామపై గతంలో సీఐడీ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసింది. ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ.. రఘురామకు నోటీసులు పంపగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ లో విచారణ జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకు కోరినట్లుగా హైదరాబాద్ లో విచారణ జరపాలంటూ సుప్రీం సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరవ్వాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులకు ఈ నెల 16వ తేదీనే సమాధానం చెప్పినట్లు రఘురామ చెబుతున్నారు. విచారణకు హాజరవుతారా లేక ఏదో ఒక విధంగా మళ్లీ వాయిదా వేస్తారా అనేది చూడాల్సి ఉంది.