
somu veerraju on alliance with janasena
బీజేపీ-జనసేన మధ్య పొత్తు పెద్ద గందరగోళంగా మారింది. పొత్తు ఉన్నప్పటికీ బీజేపీతో కలిసి బలంగా ముందుకెళ్లలేకపోతున్నామని.. రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం వల్ల తన సమయం వృథా అవుతోందని ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దానికి తోడు జనసేనతో దూరం పాటించాలంటూ ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆదేశాలిచ్చినట్లు సోము వీర్రాజు పేరిట వైరల్ అయిన వ్యాఖ్యలతో ఇక ఈ రెండు పార్టీల పొత్తు అటకెక్కినట్లే కనిపించింది. కానీ ఇంతలోనే సోము వీర్రాజు నుంచి మరో ప్రకటన వచ్చింది. జనసేనతో పొత్తు విషయంలో తాను చెప్పిందొకటి.. మీడియాలో ప్రచారమైంది మరొకటని చెప్పుకొచ్చారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు : సోము వీర్రాజు
జనసేనతో దూరం పాటించాలని ఏపీ బీజేపీ నిర్ణయించిందని.. ఆ విషయాన్ని తాను అనంతపురం ప్రెస్ మీట్లో చెప్పానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సోము వీర్రాజు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనసేనతో పొత్తు ఉంటుందనే తాను ఎప్పుడూ చెబుతూ వస్తున్నానని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోధర్ కూడా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీజేపీకి జనసేన దూరం జరుగుతోందా..?
జనసేనతో బీజేపీ పొత్తు కోరుకుంటుందనేది సుస్పష్టం. కానీ జనసేన అడుగులు బీజేపీకి దూరం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీతో పొత్తుపై ఇటీవల అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్… చంద్రబాబుతో భేటీ ద్వారా టీడీపీ-జనసేన పొత్తు ఉండవచ్చుననే ప్రచారానికి ఆస్కారమిచ్చారు. అదే సమయంలో వామపక్షాలను కూడా కలుపుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ పరిణామాలు బీజేపీకి మింగుడుపడని విషయం. బీజేపీకి ఏమాత్రం గిట్టని పార్టీలతో జనసేన దోస్తీకి సిద్ధమవడం బీజేపీకి దూరం పెట్టేందుకేనా అనే అనుమానాలు కలగకపోవు. వచ్చే ఎన్నికలకు తమ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని పవన్ గతంలో పేర్కొన్నారు. ఒకటి.. టీడీపీ, బీజేపీలతో పొత్తు, రెండు.. బీజేపీతో మాత్రమే పొత్తు,మూడు.. ఒంటరిగా పోటీ చేయడం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు ఆప్షన్లు కాక పవన్ నాలుగో ఆప్షన్ను కూడా పరిశీలిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టీడీపీతో కలిసి ముందుకెళ్లడం. అదే జరిగితే బీజేపీకి పవన్ కల్యాణ్ బిగ్ షాకిచ్చినట్లేననే ప్రచారం జరుగుతోంది.