
ys jagan
ఎన్టీఆర్ అంటే చంద్రబాబునాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవం అన్నారు సీఎం జగన్. ఎన్టీ రామారావుపై ఎలాంటి కోపం లేదన్నారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియాలోనే ఎవరూ ఉండరన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మార్చే బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే.. బహుశా ఇంకా చాలా కాలంపాటు ఎన్టీఆర్ బతికుండే వారన్నారు.
నాడు దివంగత రాజశేఖర్ రెడ్డి అయినా.. నేడు వైసీపీ అయినా.. ఎన్టీఆర్ ను ఏనాడూ అగౌరవ పర్చలేదన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతానని చెప్పానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాను ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు చెప్పారు జగన్. వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లుపై.. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం జగన్.
“ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 వంటి పథకాలన్నింటికి కూడా సృష్టికర్త రాజశేఖర్‌రెడ్డి. నాన్న చదువురీత్యా కూడా ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ప్రారంభంలో పులివెందులలో ఆస్పత్రి పెట్టి.. డాక్టర్‌గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు.
ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దగ్గరగా, వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఆరోగ్య రంగంలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వైఎస్సార్ పేరును ఈ యూనివర్సిటీకి పెట్టడం సమంజసమని మనస్ఫూర్తిగా భావించా.”
-అసెంబ్లీలో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు సీఎం జగన్. అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపే అంటే 1983 కంటే ముందే ఏర్పడినట్లు పేర్కొన్నారు. మిగతా 3 మెడికల్ కాలేజీలు శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో వైఎస్సార్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జగన్. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజీకి కూడా కట్టలేదన్నారు. రాష్ట్రంలోని 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు కట్టిన, కడుతున్న వైఎస్సార్ పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా? క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని టీడీపీని ప్రశ్నించారు జగన్.