
assembly
అధికార, ప్రతిపక్షాల వాదప్రతివాదనలు.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. వెరసి ఐదు రోజుల పాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ.. అమవరాతి రైతులు పాదయాత్ర చేస్తున్న వేళ.. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులపాటు వాడివేడీగా సాగాయి. మూడు రాజాధానులు, నాడు- నేడు, పోలవరం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంపై అసెంబ్లీలో సభ్యులు చర్చించారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించింది.
ప్రతిపక్షం టీడీపీ అసెంబ్లీ జరిగిన చర్చల్లో సరిగ్గా పాల్గొనలేదని వైసీపీ సభ్యులు చెబుతున్నారు. కీలక బిల్లుల ఆమోదం సమయంలో కూడా కావాలనే గొడవ చేసి.. బయటికి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యులు లేకపోయినా.. తాము మాత్రం.. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు అధికార వైసీపీ సభ్యులు చెబుతున్నారు. ప్రధానంగా మూడు రాజధానులు, పోలవరంపై ప్రభుత్వం ఎలాంటి విధానంతో ముందుకు పోతుందనే విషయాన్ని అసంబ్లీ వేదికగా వైసీపీ ప్రభుత్వం చెప్పింది. పోలవరం విషయంలో గతం ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపింది.
చివరి రోజు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లుపై జరిగిన చర్చలో టీడీపీ సభ్యులు పాల్గొనకుండా.. స్పీకర్ పొడియం వద్ద గొడవకు దిగారు. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా.. టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో.. స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు . ఆ తర్వాత.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఆవశ్యతకను సీఎం జగన్ సభలో వివరించారు. సభ్యులందరూ ఆమోదించారు.
సమావేశాల్లో కీలక నిర్ణయాలు..
- డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక
- ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఆమోదం