
British Deputy High Commissioner Gareth Wynne Owen
- బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు అమోఘమని, అందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్దతులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అమరాీవతి సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అనంతరం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయన్న విన్ ఓవెన్, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని.. జగన్ కు వివరించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షణ్ణంగా చర్చించిన అంశాలను ముఖ్యమంత్రితో విన్ ఓవెన్ పంచుకున్నారు.
యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అమలుచేయాలన్న ప్రణాళిక చాలా బావుందని గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. అందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్ బృందానికి సీఎం జగన్. యూకే – భారత్ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్థుల బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంకి హామీ ఇచ్చింది బ్రిటీష్ బృందం. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటీష్ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆసక్తిగా తెలుసుకున్నారు విన్ ఓవెన్.
ఇక్కడికి అందుకే వచ్చాం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ.. రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తాము గమనిస్తున్నామని, వాటిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకే నేడు ఇక్కడకు రావడం జరిగిందన్నారు గారెత్ విన్ ఓవెన్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్, ఇతర అధికారులు రాష్ట్రంలో రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా అమలు చేయబడుచున్న పలు పథకాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కు వివరించారు.
గత మూడునర్రేళ్ల జగనన్న పాలనలో వ్యవసాయం దండగకాదు పండుగ అనే స్థాయిని తీసుకు రావడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ కు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తు నుండి విక్రయం వరకు అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తున్నామని తెలిపారు. ఇ-క్రాప్ నమోదు నుండి బ్యాంకింగ్ సేవల వరకూ అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తూ బహుళార్ధక సాధక కేంద్రాలుగా ఈ ఆర్.బి.కే.లు పనిచేస్తున్నాయని వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సాయంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు వైఎస్సార్ సున్నావడ్డీ పంట ఋణాలు, నాణ్యమైన ధృవీకరించిన వ్యవసాయ ఉత్పాదకాలు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల పంపిణీ కై కస్టమ్ హైరింగ్ సెంటర్లు, వ్యవసాయ విజ్ఞానం అందించే గ్రంధాలయాలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోలు కేంద్రాల ను ఈ ఆర్.బి.కె.ల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.