
విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అమలులో మాత్రం చాలా వరకు పెండింగ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగుల పంపకాలు, ఆస్తుల లెక్కలు, ఆస్తుల విభజన తదితరాలు ఉన్నాయి. మరోవైపు విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలు కూడా నెరవేరాల్సి ఉంది. చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదాపై కేంద్రం మాట మార్చిన విషయం తెలిసిందే. ఇక కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, మెట్రో రైలు, రాజధాని అభివృద్ధికి నిధులు ఇలా ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా అటునుంచి మాత్రం సానుకూల స్పందన కనిపించలేదు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు ఎన్నోసార్లు సమస్యలు లేవనెత్తినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు.
ఈ నేపథ్యంలో విభజన సమస్యలపై ఈనెల 23న దిల్లీలో కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రహోంశాఖ అధికారులు సమాచారం పంపారు. సమావేశానికి తప్పకుండా హాజరవ్వాలని సూచించినట్లు సమాచారం. పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై సెప్టెంబర్ 27న జరిగిన సమావేశంలో ఉమ్మడి అంశాలతో పాటు ఏపీకి చెందిన ఏడు అంశాలపై అధికారులు చర్చించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను గత సమావేశం అజెండాలో కేంద్రం చేర్చింది. అయితే ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను 10 ఏళ్లలోపు పూర్తిచేయాలనే నిబంధనలు ఉన్నందున ఆ మేరకు వాటిని పరిష్కరించే దిశగా కేంద్రహోంశాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 23న తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది.