
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాణిజ్యపరంగానే కాకుండా.. పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి. ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలను ఆలవాలంగా వెలుగొందుతున్న.. వైజాగ్ లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూడటానికి కేవలం ఏపీ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తుంటారు. విశాఖ జిల్లాలోని పలు సుప్రసిద్ధం పర్యటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓడరేవు..
విశాఖపట్నం ఓడరేవు.. భారతదేశంలోనే అతిపెద్ద నాలుగోవది. వైజాగ్ లోని బంగాళా ఖాతం ఒడ్డున ఉంది. నగరంలోని సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండ, లోయలతో ఉంటుంది.
బొర్రా గుహలు..
విశాఖ పట్టణం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో బొర్రా గుహలు ఉన్నాయి. విశాఖపట్టణం నుంచి బొర్రా గుహలు వరకు చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ ఈ గృహాలను కనుగొన్నారు. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. ప్రకృతితో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను చూస్తే అబ్బురపడని వారు ఉండరు.
అరకు లోయ:
అరకులోయ వైజాగ్ కు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరకు వెళ్లే ఇరువైపులా దట్టమైన అడవులు, అనంతగిరి కొండలలో కాఫీ తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. చుట్టూ కొండలు, లోయలు నిండి ఉంటాయి.
లంబ సింగి..
లంబ సింగి.. విశాఖ పట్టణానికి సుమారు 100 కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ పగలంతా మంచు వర్షంలా కురవడం ప్రత్యేకం. అక్కడికి వెళ్లిన పర్యాటకులు. చల్లని గాలులు, కాఫీ తోటల మధ్య మధురమైన అనుభూతిని పొందుతారు. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు.
సబ్ మెరైన్ మ్యూజియం..
వైజాగ్ లోని రామకృష్ణ బీచ్ లో ఉన్న సబ్ మెరైన్ మ్యూజియం చాలా ప్రత్యేకమైనది. ఆసియా ఖండంలో ఉన్న సబ్ మెరైన్ మ్యూజియం ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ మ్యూజియాన్ని స్మ్రితిక అని పిలుస్తారు.