
industrial investments
పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నివేదిక వెల్లడించింది. 2022లోని మొదటి ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ. 40,361 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఒడిశా రూ.36, 828 కోట్లతో రెండో స్థానంలో నిలిచినట్లు డీపీఐఐటీ వెల్లడించింది.
అయితే భారీ స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడులు ఏపీ ఆకర్షించడానికి గల కారణాలను కూడా డీపీఐఐటీ వివరించింది. పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం ఊతమివ్వడమే ఇందుకు కారణమని చెప్పింది. పరిశ్రమలు త్వరగా ఉత్పత్తిని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ తాజా గణాంకాలు వెల్లడించాయి.
జూలై 2022 నుంచి నేటి వరకు ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలను డీపీఐఐటీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక గణంకాల ప్రకారం 1,71,285 కోట్ల రూపాయలు భారతదేశంలో పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయని అయితే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 40,361 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షి్ంచి దేశంలోనే అగ్రస్థానంలో పేర్కొన్నాయి . 2022 సంవత్సర మొదటి ఏడు నెలల భారతదేశ పారిశ్రామిక మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు దాదాపు 45 శాతం ఆకర్షించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని డీపీఐఐటీ నివేదిక పేర్కొంది.