
ap assembly
- మెరుగవుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరుగుతున్న ప్రచారం నిజమేనా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వస్తున్న ఆరోపణలు వాస్తవమేనా? అంటే ఈ లెక్కలు చూడాల్సిందే. ప్రత్యేక రాష్ట్రంగా ఏపీ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక లోటు ఉంది. గత ప్రభుత్వం కొన్ని అప్పులు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మరికొన్ని చేసింది. అయితే కోవిడ్ వల్ల ఎదురైన ఇబ్బందుల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతూ.. అభివృద్ధి దిశగా పయనిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. రాక ముందు చేసిన అప్పులు, తీసుకున్న రుణాలు, జీడీపీ ఇలా ప్రతి అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వెల్లడించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం.
జీడీపీలో మెరుగు..
2018–19లో చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీలో పెరుగుదల 5.36 శాతం కాగా.. జగన్ హయాంలో 2019–20లో వచ్చేసరికి 6.89 శాతంతో దేశంలో 6వ స్థానానికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో జీడీపీ పరంగా 21వ స్థానంలో ఉన్న ఏపీ.. వైసీపీ మూడేళ్ల పాలనలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఉంది. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014–19 మధ్య.. 4.45 శాతమే ఉంటే ఉంది. వైసీపీ పాలనలో మూడేళ్లలోనే 5 శాతానికి పెరిగింది. రెండేళ్లుగా కోవిడ్ విలయం నేపథ్యంలో దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పడిపోకుండా పెరుగుదల నమోదైంది. ఆ నాలుగింటిలో ఏపీ ఒకటి. మణిపూర్, పశ్చమబెంగాల్, తమిళనాడు, ఏపీలో మాత్రమే పెరుగుదల కనిపిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్ పడిపోకుండా చేయడం వల్లే జీడీపీలో మెరుగుదల కనిపించిందని ప్రభుత్వం చెబుతోంది. అమ్మఒడి, చేయూత ,ఆసరా, సామాజిక పెన్షన్లు వంటి ఇతర కార్యక్రమాలు అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంటోంది.
అప్పులు కూడా అంతంతే..
రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,20,556 కోట్లు. 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు రూ.2,69,462 కోట్లు. ఆ ఐదేళ్లలో రాష్ట్ర రుణం 123.52 శాతం పెరిగింది. వైసీపీ మూడేళ్ల పాలనలో చేసిన ప్రభుత్వ రుణం రూ.3,82,165 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 41.83 శాతం.
గ్యారెంటీలూ ఎవరి హయాంలో ఎక్కువ అంటే..
2014లో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు రూ.14,028.23 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు మొత్తం రూ.59,257.31 కోట్లకు చేరాయి. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.3,28,719 కోట్లు. అంటే ఆ ఐదేళ్లలో పెరిగిన రుణాలు ఏకంగా 144.25 శాతం.
వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాలు రూ.59,257.31 కోట్లు కాగా.. ఈ మూడేళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన రుణాల మొత్తం రూ.1,17,730.33 కోట్లు. ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07 శాతం.
కేంద్రం- రాష్ట్రం మధ్య పోలిక..
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు (డెట్ టు జీడీపీ) పతాక స్థాయికి చేరుకున్నాయి. కోవిడ్ సమయంలో దాని ప్రభావం ఎలా పడిందో కనిపిస్తోంది. 2020–21తో పాటు, 2021–22లో డెట్ టు జీడీపీ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. 2014–15లో స్థూల దేశీయ ఉత్పత్తి రూ.124 లక్షల కోట్లు అయితే, ఆ ఏడాది కేంద్రానికి ఉన్న అప్పులు రూ.62,42,220 కోట్లు. అంటే డెట్ టు జీడీపీ 50.07 శాతం. 2020–21లో జీడీపీ రూ.198,00,913 కోట్లు కాగా, ఆ ఏడాది కేంద్రం అప్పులు రూ.120,79,018 కోట్లు. అంటే డెట్ టు జీడీపీ ఏకంగా 61 శాతానికి పెరిగింది. 2021–22లో జీడీపీ రూ.236,64,636 కోట్లు కాగా, అప్పుల మొత్తం రూ.135,88,193 కోట్లు. అంటే డెట్ టు జీడీపీ 57.42 శాతం
రాష్ట్ర విభజనకు ముందు నుంచి కేంద్రంతో పోలిస్తే, రాష్ట్ర రుణాల పెంపు తక్కువగానే ఉంది. 2014 మే 31 నాటికి, కేంద్రానికి ఉన్న రుణాలు రూ.59,09,965.48 కోట్లు. 2019 మే 31 నాటికి ఆ రుణం రూ.94,49,372.03 కోట్లకు చేరింది. అంటే ఐదేళ్లలో కేంద్రం అప్పులు 59.88 శాతం పెరిగాయి.
కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ అప్పు చేసింది. అదే చంద్రబాబు హయాంలో చూస్తే అప్పటి కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ అప్పులు చేసింది. పైగా బాబు హయాంలో కరోనా కూడా లేకపోవడం గమనార్హం.