
andhra pradesh stands at top 4 in e governance under ysrcp government
దేశంలో ఉత్తమ ఈ-గవర్నెన్స్ అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. 2021-22 సంవత్సరానికి ప్రకటించిన ఈ-గవర్నెన్స్ ర్యాంకుల్లో ఏపీకి ఈ స్థానం దక్కింది. టాప్-1, 2, 3 స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు ఆన్లైన్ పద్దతిలో అందిస్తున్న సేవల ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేశారు.కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో రూ.136.07 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 109.27 కోట్లు, తమిళనాడులో 84.23 కోట్లు, ఏపీలో 52.90 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగాయి.
ఎలక్ట్రానిక్ సేవలు.. ఆరు కేటగిరీలు…
ఎలక్ట్రానిక్ సేవలను నివేదికలో ఆరు కేటగిరీలుగా వర్గీకరించారు. ఇందులో సమాచార సేవలు, మొబైల్ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, బిజినెస్ సిటిజన్ సేవలు, చట్టబద్ధమైన, చట్టబద్ధతలేని సేవలు, సామాజిక ప్రయోజనాలుగా పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో సామాజిక ప్రయోజనాల లావాదేవీల కింద రూ.33 కోట్ల లావాదేవీలు జరిగాయి. యుటిలిటీ బిల్లుల చెల్లింపుల కింద రూ.10.76 కోట్లు, సమాచార సేవల కింద రూ.4.13 కోట్లు, చట్టబద్ధత ఉన్న, చట్టబద్ధత లేని సేవల కింద రూ.4.16 కోట్ల లావాదేవీలు జరిగాయి.
ఏపీలో ఈ-గవర్నెన్స్ ఇలా :
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలు ఎలక్ట్రానిక్ పద్దతిలోనే సాగుతున్నాయి. డిజిటల్ కార్యదర్శుల ఆధ్వర్యంలో కంప్యూటర్ల ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చాలా వరకు సేవలను ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల పథకాలను ఎలక్ట్రానిక్ పద్దతిలోనే అందిస్తున్నారు. కంప్యూటర్లో బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు ఇలా ఎలక్ట్రానిక్ పద్దతిలో ప్రజలకు చేరడాన్ని సామాజిక ప్రయోజనాలుగా తాజా నివేదికలో పేర్కొన్నారు.