
nannari
నల్లమల అడవి.. ఈ పేరు వినగానే అందరికి టక్కున గుర్తొచ్చేది ఒక్కటే ఎర్రచందనం, ప్రపంచంలో ఎక్కడలేని విధంగా అపారమైన ఎర్రచందన నిల్వలు ఈ నల్లమల అడవి సొంతం. దేశ విదేశాలకు పాకిన ఈ పేరు ఇప్పుడు మరో ఖ్యాతిని సొంతం చేస్కోబోతుంది. అదే ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు నన్నారి (షర్బత్ తయారీకి ఉపయోగించే దుంప) సాగు చేయుటకు ప్రత్యేక శ్రద్ధ కనుబరుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రచిస్తోంది.వేసవిలో దాహార్తిని తీర్చడంతోపాటు శక్తినిచ్చే నన్నారి షర్బత్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే శ్రీశైలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నేతృత్వంలో నన్నారి (సుగంధి) సాగుకు గిరిజనులకు అవసరమైన సహాయ సహకారాలను అందించే విధంగా ముందుకు సాగుతుంది.
ప్రభుత్వ సహకారం
ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో 171 గూడెంలలో నివసించే 27,857 మంది చెంచు జాతి గిరిజనుల జీవనోపాధికి ఊతమిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిజానికి నల్లమల పరిసర ప్రాంతాల్లోని చెంచులు ప్రధానంగా నల్లమల అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంచడంతో పాటు ఆ భూముల్లో సాగు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించటం ఈ ప్రాంత గిరిజన జాతులకు శుభపరిణామం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా అటవీ ఫలసాయమైన నన్నారి, తేనె, ఉసిరి, కుంకుడుకాయలు, మాడపాకులు, ముష్టి గింజలు, చింతపండు వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేంద్రాలకు విక్రయించి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో అనేక చెంచు జాతి కుటుంబాలు ఇంటి వాకిళ్ళలో ఈ మొక్కలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ సాగుతో ఉపాధి పొందుతున్నాయి. మరో వంద ఎకరాల్లో సాగుకు ఐటీడీఏ అధికారులు కార్యాచరణ చేపట్టారు. నన్నారి గడ్డలు (ముడిసరుకు) కిలో రూ.450 నుంచి రూ.600 కొనుగోలు చేసి నన్నారి షర్బత్ తయారీకి వినియోగిస్తున్నారు. గిరిజనులను మభ్యపెట్టి వ్యాపారులు చౌకగా కొనుగోలు చేస్తున్నారు. దీనిని నివారించటానికి గిరిజనులు మంచి ధరకు అమ్ముకునేలా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వికాస కేంద్రాలు
మూడు జిల్లాల్లో 13 ప్రధానమంత్రి వన్ధన్ వికాస కేంద్రాలు (ప్రకాశం–5, నంద్యాల–6, పల్నాడు–2) చప్పున ఈ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కో కేంద్రంలో 300 మంది సభ్యుల చొప్పున మొత్తం 13 వికాస కేంద్రాల్లో 3,900 మంది సభ్యులకు అవకాశం కల్పించింది. వీటి ద్వారా నన్నారితోపాటు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు గిరిజనులు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ కేంద్రాలను అనుసంధానిస్తూ డోర్నాలలో ఐదు ఎకరాల్లో ట్రైబల్ పార్కు ఏర్పాటుచేసి గిరిజనుల ఉత్పత్తులను విక్రయించనుంది.
శిక్షణ
శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్వంలో ప్రస్తుతం 10 కేంద్రాల్లో వెయ్యి మందికిపైగా చెంచులకు నన్నారి శుద్ధి, షర్బత్ తయారీపై శిక్షణనిచ్చారు. అడవి నుంచి సేకరించిన నన్నారి వేర్లను ప్రాసెసింగ్ చేసి, శుద్ధిచేసి షర్బత్ తయారు చేసి విక్రయించేలా వీరికి శిక్షణనిచ్చారు.
నల్లమల బ్రాండింగ్
దీనిలో భాగంగానే నల్లమల బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయించాలని ప్రభుత్వం సంకల్పించింది. చెంచులు సేకరించే నన్నారి, తేనె, వనమూలికలతోపాటు ఇతర అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేలా శ్రీశైలం ఐటీడీఏ పాలక మండలి ఇటీవల తీర్మానించింది. అంతేకాకుండా ఇప్పటికే నన్నారి షర్బత్ తయారీపై యువతకు శిక్షణనిచ్చి నన్నారి దుంపల (వేర్లు) శుద్ధికోసం ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్ కు రూ.3 లక్షల చొప్పున రెండు ప్రాసెసింగ్ యూనిట్లను ఐటీడీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది..