
Andhra Pradesh Industrial Infrastructure Corporation
మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. మూడేళ్ల పాలనలో రికార్డు స్థాయిలో పనులు చేపట్టింది వైసీపీ సర్కారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారు మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తోంది. 2021–22లో ఈ పనుల కోసం రూ.348.71 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చుచేస్తే.. అందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు ఖర్చు చేయగా.. వైఎస్సార్సీపీ ఒక్క సర్కారు మూడేళ్లలోనే రూ.1,058 కోట్లు వెచ్చించి రికార్డు సృష్టించింది.
వైసీపీ మూడేళ్ల పాలనలో మొత్తం 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ పడొద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఈ మేరకు భాగంగా ఇంజనీరింగ్ పనులపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి వెల్లడించారు.
కరోనా వల్ల.. గత రెండేళ్ల పాటు అనుకున్న లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోలేకపోయింది. ఈ ఏడాది గతేడాది కంటే అత్యధికంగా వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. త్వరలోనే కృష్ణపట్నం వద్ద చెన్నై–బెంగళూరు కారిడార్లో భాగంగా క్రిస్సిటీ పేరుతో 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే.. తక్షణం ఉత్పత్తి ప్రారంభించేలా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఐఐసీ వీటి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొప్పర్తి, తిరుపతి, పెద్దాపురం, విజయవాడ వంటి చోట్ల 20కిపైగా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది. కేవలం మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా ఏపీఐఐసీ మంచి పనితీరునే కనబరుస్తోంది. గడిచిన ఏడేళ్లుగా చూస్తే.. ఏపీఐఐసీ సగటు వార్షిక ఆదాయం రూ.590 కోట్లుగా ఉంటే 2021–22లో రూ.656 కోట్లను ఆర్జించింది. 50 ఏళ్ల క్రితం రూ.20 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఏపీఐఐసీ ఇప్పుడు రూ.వేల కోట్ల ప్రాజెక్టులను చేపడుతోంది. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని ప్రాజెక్టులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది.