
plastic flex banner
- ఫ్లెక్సీ తయారీదారుల వినతుల మేరకు ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును జనవరి 26కు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి నిషేధం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే క్లాత్ ఫ్లెక్సీల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో నిషేధంపై పునరాలోచించాలని సీఎం భావించారు. అందులో భాగంగా సానుకూలంగా స్పందించిన సీఎం ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దును జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకు రావాలని ఆదేశించారు.
ఈలోగా వారికి అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలని కోరారు. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ. 20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సి తయారీదారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాజా నిర్ణయంతో ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26 కి వాయిదా పడినట్లైంది.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ఫ్లెక్సీ తయారీదారుల ఉపాధినీ దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో ఎలాంటి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉండకూడదని, వాటికి బదులుగా క్లాత్ ఫ్లెక్సీలను తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఫ్లెక్సీ తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.