
INVESTMENT IN AP
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. బడా కంపెనీలు ఏపీలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా టాటా సన్స్ గ్రూప్ కూడా ముందుకొచ్చింది. ఇటీవల ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం జగన్.. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చర్చించారు. ఇలా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
మరిన్ని పెద్ద కంపెనీలు ఏపీలో పెట్టుబడులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గతంలోనే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. చెప్పిన విధంగా ఒక్కో ఏపీకి వరుస కడుతున్నాయి. తాజాగా టాటా సన్స్ చైర్మన్.. సీఎం జగన్ తో భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.
వాస్తవానికి జగన్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రావడం లేదని.. ఉన్న పరిశ్రమలు సైతం వెనక్కు తరలిపోతున్నాయని ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించింది. ప్రతిపక్షానికి మాటలతో కాకుండా.. నేరుగా పెట్టుబడులను తీసుకొచ్చి సమాధానం చెప్పాలని జగన్ ప్రభుత్వం భావించింది. ఆ విధంగా ముందుకు పోతోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత పెట్టుబడును ఆకర్శించడంలో వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
2022 సంవత్సరానికి గాను మొదటి 7 నెలల్లోనే 40,361 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. రికార్డు సృష్టించింది. 2022లో దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం పెట్టుబడులను ఆకర్షించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించిందని.. డీపీఐఐటీ నివేదిక సైతం వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ ) నివేదిక ప్రకారం 1,71,285 కోట్ల భారతదేశ పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ 40,361 కోట్ల రూపాయలను ఆకర్షించిందని నివేదికలో ఉంది.
అయితే ఈ పెట్టుబడుల ప్రవాహానికి జగన్ దావోస్ పర్యటనే కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అక్కడ భారీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అసెంచర్, హెచ్సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. దీంతో తిరుపతి, శ్రీకాళహస్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరు వేల కోట్ల రూపాయలతో పలు కంపెనీలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు కంపెనీలకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపనలు పూర్తి చేశారు.