
అన్ని రాజకీయ పార్టీలదీ అదే దారి | ఎన్నికలకు రెండేళ్ల ముందే హడావిడి
ఆంధ్రప్రదేశ్‌లో సర్వే సందడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా సర్వేలతో ప్రజానాడి పట్టే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు అంతర్గత సర్వేలతో తమ బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి. వీటికి తోడు జాతీయ స్థాయి సంస్థల సర్వేలు సరే సరి. సర్వేల్లో పార్టీ బలంతోపాటు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుత ఇన్చార్జుల పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు.
సర్వే ఫలితం ఆధారంగా..
రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న సర్వేలే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధారిస్తున్నాయి. సర్వేలో పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. సర్వేలో నెగటివ్ వస్తే అంతే సంగతులంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన, గెలిచిన అభ్యర్థుల్లోనూ పలువురికి టికెట్ రాదనే సంకేతాలు పార్టీల అధినేతలు ఇస్తున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలే కనిపించే అవకాశం ఉంది.
రెండు మూడు ఆప్షన్లు..
రాజకీయ పార్టీలన్నీ నియోజకవర్గంలో ఒకరిపైనే ఆధారపడకుండా రెండు, మూడో ఆప్షన్లనూ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థితోపాటు ఇన్చార్జ్, సెకండ్ క్యాడర్‌నూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. తద్వారా అభ్యర్థికి టికెట్ విషయంలో భయం ఉండి, బాగా పని చేస్తారని పార్టీలు భావిస్తున్నాయి.
జంపింగ్‌ల కోణంలో..
ఎన్నికలు సమీపించే సమయంలో జంపింగ్ జపాంగులు కామనే. ప్రతిపక్షం, ఇతర పార్టీల నేతలు ఎక్కువగా అధికార పార్టీలోకి దూకుతుంటారు. టికెట్ రాని అభ్యర్థులు పక్క పార్టీల వైపు చూస్తుంటారు. నాలుగున్నరేళ్లపాటు ఒకే పార్టీలో ఉన్నా ఎన్నికల ముందు మాత్రం రకరకాల సిత్రాలు కనిపిస్తాయి. ఈ కోణంలోనే ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ సెకండ్ క్యాడర్‌ను కూడా ఫోకస్ చేస్తున్నాయి.