
amazon begins mass layoffs in measures of cost cutting almost ten thousand employees may effect
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులను లేఆఫ్స్ గండం వెంటాడుతోంది. ఇప్పటికే మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ సగానికి సగం ఉద్యోగులను సాగనంపేసింది. అదే బాటలో మరో మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ఫేస్బుక్ కూడా భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటించింది. దాదాపు 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా లేఆఫ్స్‌పై ఫోకస్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులను కలిగిన జాబితాలో టాప్‌లో ఉన్న అమెజాన్.. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమవుతోంది. ఈ దిశగా ఇప్పటికే అమెరికాలో లేఆఫ్స్ ప్రక్రియను ప్రారంభించింది.
అమెజాన్ లేఆఫ్స్‌పై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. కంపెనీ డివైజెస్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లింప్ తన బ్లాగులో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చాలా లోతైన సమీక్షల తర్వాత అమెజాన్‌లో లేఆఫ్స్‌పై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని టీమ్స్‌ను, సేవలను ఏకీకృతం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. కొన్ని రోల్స్ అవసరం కంపెనీకి లేదని గుర్తించామన్నారు. ఈ క్రమంలో అమెజాన్ డివైజెస్ అండ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ నుంచి కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకక తప్పట్లేదన్నారు. ఈ విషయాన్ని వెల్లడించడం చాలా బాధాకరంగా ఉందని… ఈ నిర్ణయంతో ప్రతిభావంతులైన అమెజాన్ ఉద్యోగులను తాము కోల్పోనున్నామని అన్నారు.
ఉద్వాసనకు గురవనున్న ఉద్యోగులకు ఇప్పటికే కంపెనీ సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా అసాధారణ, అనిశ్చితితో కూడిన ప్రతికూల పరిస్థితులను అమెజాన్ ఎదుర్కొంటోందని.. ఈ క్రమంలో వ్యయాన్ని తగ్గించుకునేందుకు లేఆఫ్స్‌పై కంపెనీ దృష్టి సారించిందని తెలిపారు. ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు ట్రాన్సిషనల్ బెనిఫిట్స్ కింద కంపెనీ తరుపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సదరు ఉద్యోగులు కంపెనీలోనే మరో రోల్ (జాబ్)లోకి మారేందుకు తగిన సహాయ, సహకారాలు అందిస్తామని.. ఒకవేళ కుదరని పక్షంలో ఇతర కంపెనీల్లో ఉద్యోగాన్వేషణలోనూ తమ సహాయం ఉంటుందని తెలిపారు.
ఫేస్బుక్, ట్విట్టర్, అమెజాన్ మాత్రమే కాదు మున్ముందు మరిన్ని కంపెనీలు లేఆఫ్స్ చేపట్టే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు లేఆఫ్స్ ప్రకటించనప్పటికీ.. కొత్త రిక్రూట్మెంట్ ప్లాన్స్ ఇప్పట్లో పెట్టుకోవద్దనే యోచనలో ఉన్నాయి. ఇప్పటికైతే ఈ సెగ దేశీ ఐటీ సెక్టార్‌ను తాకలేదు. అయితే అంతర్గతంగా ఆయా ఐటీ కంపెనీల్లోనూ ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. అది ఇంకా లేఆఫ్స్ స్టేజీ వరకు రాలేదని అంటున్నారు. బైజుస్, అనకాడమీ, వేదాంతు, కార్స్ 24, ఓలా తదితర దేశీ సంస్థలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేసినట్లు చెబుతున్నారు.