
amaravati padayatra temporary halt
అడుగుపెట్టిన ప్రతీ చోటా నిరసన ఎదురవుతున్నా.. ప్రజా ఆకాంక్షలంటే పట్టిలేనితనం, తమ మాటే చెల్లుబాటు కావాలనే ధోరణితో అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పేరుకే రైతుల పాదయాత్ర.. వెనుకుండి నడిపిస్తున్న శక్తులెవరో ప్రజలందరికీ తెలుసు. పైగా కోర్టు నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తూ.. వెళ్లిన ప్రతీచోట అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో స్థానికులపై వీరి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్నవారు హైకోర్టు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే నిబంధనలు పాటించమని పోలీసులు చెప్పడమే వారికి తప్పుగా తోచడం విడ్డూరం. పోలీసులతో వాగ్వాదానికి దిగి రాద్దాంతం చేసి.. చివరకు పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు.
కోర్టు ఆదేశాలు పాటించమన్నందుకు పోలీసులతోనే వాగ్వాదం
అమరావతి రైతుల పాదయాత్ర 41వ రోజు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పోలీసులు ఉదయాన్నే రంగంలోకి దిగి పాదయాత్ర కోర్టు నిబంధనలకు అనుగుణంగా సాగాలని తేల్చి చెప్పారు. కోర్టు ఆదేశానుసారం పాదయాత్రలో పాల్గొనే 600 మంది తప్పనిసరిగా ఐడీ కార్డులు చూపించాలని.. సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారు యాత్రలో పాల్గొనేందుకు వీలు లేదని చెప్పారు. డీజీపికి అందజేసిన లిస్టులో ఉన్నవారే యాత్రలో పాల్గొనాలని చెప్పారు. కేవలం అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే యాత్రలో ఉండాలని స్పష్టం చేశారు. కానీ అమరావతి పాదయాత్రికులు ఇందుకు అంగీకరించకపోగా.. పోలీసులతోనే వాగ్వాదానికి దిగడం గమనార్హం. అంటే.. కోర్టు ఆదేశాలు కూడా వీరికి లెక్కలేదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టును ఆశ్రయిస్తామన్న అమరావతి పాదయాత్రికులు
పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయించి.. కోర్టు మార్గదర్శకాలతోనే పాదయాత్ర కొనసాగిస్తామని అమరావతి పాదయాత్రికులు చెబుతున్నారు. ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్నందునా నాలుగు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. పాదయాత్రకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని… తదుపరి కార్యాచరణను జేఏసీలో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించారు.