
Clash between TDP leaders
అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు చేస్తున్న పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో రచ్చ లేపుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు పరస్పరం గొడవకు దిగారు. ఏకంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన జవహర్‌ను ఒక వర్గం అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ గొడవకు కారణం ఏంటి? అమరావతి రైతుల పాదయాత్ర కొందరు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సైతం ఇష్టం లేదా? మొదటి నుంచి అమరావతి రాజధానికి మద్దతుగా మాట్లాడుతున్న మాజీ మంత్రి జవహర్ ను తాజాగా అడ్డుకోవడంలో ఉద్దేశం అదేనా ?
మూడు రాజధానుల చుట్టూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో ఉత్తరాంధ్రకు వారి పాదయాత్ర చేరుకోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొవ్వూరులో జరిగిన తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ టీడీపీ అధిష్ఠానాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీడీపీలో సైతం విశాఖను రాజధాని చేయాలని చాలా మంది నాయకులు కోరుకుంటున్నారు. అందుకే అమరావతికి అనుకూలంగా జరిగే ఆందోళనల్లో ఈ ప్రాంత మెజార్టీ టీడీపీ నాయకులు పాల్గొనడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో ఉత్తరాంధ్రలోకి రాబోతున్న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనవద్దని.. ఇప్పటికే క్షేత్రస్థాయిలోని శ్రేణులు నిర్ణయించుకున్నారు. దాని పర్యావసానమే తాజా గొడవ జరగడానికి కారణమని తెలుస్తోంది. విశాఖను రాజధానిగా కోరుకుంటున్న వారే.. పాదయాత్రను వ్యతిరేకిస్తూ.. మాజీ మంత్రి జవహర్ ను అడ్డుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
విశాఖ సెంటిమెంట్..
తమ ప్రాంతం అభివృద్ధి జరగాలని అందురూ కోరుకుంటారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖ రాజధాని అయితే.. తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అక్కడి ప్రజలు ఆశపడుతున్నారు. అలా ఆశపడుతున్న ప్రజల్లో టీడీపీ నేతలు కూడా ఉన్నారన్నది అక్షర సత్యం. ఆ సెంటిమెంట్ తోనే తమ ప్రాంత అభివృద్ధిని చేజేతులా.. నాశనం చేసుకోవాలని వాళ్లు కూడా అనుకోవడం లేదు. అందుకే.. మూడు రాజధానులకు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. దానికి కొవ్వూరులో తాజాగా జరిగిన ఉదంతమే కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పెరుగుతున్న ఒత్తిడి..
మూడు రాజధానుల విషయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులపై తీవ్రమైన ఒత్తి పెరిగిపోతోంది. ఈ ప్రాంతానికి రాజధాని వస్తుంటే స్వాగతించుకుండా.. అడ్డుకోవడం ఏంటనే ప్రశ్న స్థానిక నాయకులకు ఎదురవుతోంది. ఫలితంగా వారు సరిగా ప్రజల్లో కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. విశాఖ రాజధాని విషయంలో వైసీపీ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు మౌనంగా ఉండటమే కాకుండా.. విశాఖను రాజధాని చేయకుండా అడ్డుకునేందుకు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతు ఇవ్వడాన్ని.. ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో పార్టీ ఇమేజ్ పోయినా.. వ్యక్తిగత ఇమేజ్ ను పోగొట్టుకోవద్దకునే నాయకులు.. కొవ్వూరులో మాదిరిగానే సీనియర్ నేతలను సైతం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రచారం ఇలా..
కొవ్వూరులో జరిగిన గొడవను టీడీపీ వేరే విధంగా చిత్రీకరిస్తోంది. ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ అక్కడ.. విశాఖ రాజధాని- అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు అనే రెండు అభిప్రాయాల మధ్య గొడవ జరిగిందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఇది విన్న ఉత్తరాంధ్ర ప్రజలు పాపం తెలుగు తమ్ముళ్లు అంటూ.. సానుభూతిని తెలియజేస్తున్నారు.