
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి.. అది అమరావతిలోనే ఉండాలనేది అక్కడి రైతుల డిమాండ్. జగన్ సర్కార్ మాత్రం రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలంటే అభివృద్ది వికేంద్రీకరణే సరైనదని, అందుకు మూడు రాజధానుల ఏర్పాటు సరైన మార్గమని చెబుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు మరోసారి పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఉత్తరాంధ్రలోని అరసవల్లి వరకు సాగనుంది. అయితే ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దెబ్బతీయడమనేనని వైసీపీ నేతలు ఆగ్రహం చేస్తున్నారు. ప్రజాభీష్టం మేరకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టడాన్ని తాము సహించబోమని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఘాటుగానే స్పందించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తాము సహించబోమని ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేస్తున్నవారు అసలు రైతులే కాదన్నారు. అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపాడని.. అందులో ఉత్తరాంధ్ర టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా ఒక పెట్టుబడిదారుడని ఆరోపించారు. పాదయాత్రను తాము అడ్డుకుంటామని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా పడుకునైనా సరే పాదయాత్రకు అడ్డుపడుతామని.. దమ్ముంటే తమ గుండెల మీద నుంచి దాటుకుంటూ వెళ్లాలన్నారు.
ఇకనైనా పాదయాత్రను వెనక్కి మళ్లించాలని.. లేనిపక్షంలో ఏ దుష్పరిణామం జరిగినా.. దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు ఇక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనకు రాజకీయ పతనం తప్పదని అన్నారు.
అంతకుముందు, ఇదే అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఘాటుగా స్పందించారు. అమరావతి రైతుల పేరిట జరుగుతున్న పాదయాత్రలో అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దోపిడీదారులే ఉన్నారని బొత్స ఆరోపించారు. ప్రజల జీవితాలు బాగుపడొద్దు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు బాగుపడాలా.. అని ప్రశ్నించారు. ఎన్ని దుష్టశక్తులు అడ్డుపడినా పాలనా వికేంద్రీకరణ జరిగి తీరుతుందని.. జగన్ సర్కార్ దానికి కట్టుబడి ఉందని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాల సమాభివృద్ధి కోసమే జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుందన్నారు. అందరి క్షేమం, అభివృద్ధే సీఎం జగన్ ధ్యేయమని అన్నారు. అభివృద్ధి, పాలనా ఒకేచోట వికేంద్రీకరణ జరగాలనేది చంద్రబాబు స్వార్థపూరిత ధోరణి అని మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.