
pawan ntr
టాలీవుడ్ అగ్ర కథనాయకులు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వారి ప్రతి అడుగూ సంచలనమే. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా తమదైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న వారి రాజకీయ అడుగులపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడు. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా చూస్తే విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో సొంతంగా పోటీ చేసి ఒక ఎమ్మెల్యే స్థానంలోనే గెలుపొందినా 7 శాతానికి పైగా ఓట్ షేర్ పొందారు. మరో నటుడు జూనియర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరపైకి వచ్చిన ట్రిపుల్ ఆర్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ జోష్‌లో ఉన్న జూనియర్‌ను ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా కలిశారు. వీరిద్దరి కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో పొత్తులో జనసేన ఉండగా.. తాజాగా జూనియర్‌తో షా భేటీతో కొత్త సమీకరణాలపై చర్చ జరుగుతోంది.
సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న వీరిద్దరూ ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకోలేదు. కానీ రాజకీయ వేదికపై కలిసి కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో జోష్ నింపుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు జూనియర్ బంధువు. సీనియర్ ఎన్టీఆర్‌కు స్వయానా మనవడు. సినిమాతోపాటు రాజకీయ వారసత్వం పుష్కలంగా ఉన్న నటుడు జూ. ఎన్టీఆర్. మెగా స్టార్ చిరంజీవి సొంత తమ్ముడైన పవన్ కల్యాణ్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. తర్వాత సొంత పార్టీ జనసేన ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం వీరిద్దరినీ రాజకీయ ప్రచార తెరపైకి తీసుకు రానుందనే ప్రచారం జరుగుతోంది. అందుకోసమే జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ జూనియర్‌తో ప్రత్యేక చర్చలు జరిపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది.
గతంలో టీడీపీ కోసం ఎన్నికల్లో పని చేసిన జూనియర్ ద్వారా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు టీడీపీ చేస్తోందనే ప్రచారమూ లేకపోలేదు. 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో విభేదించిన టీడీపీ సింగిల్‌గా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అన్ని పార్టీలకూ సమదూరాన్ని పాటిస్తున్న వైసీపీ మాత్రం ఒంటరి పోరుకే మళ్లీ సిద్ధమవుతోంది. జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే ఏపీలో త్రిముఖ పోరు తప్పదు. కానీ జూనియర్, పవన్ కలిసి ప్రచారం చేస్తే రాజకీయ లెక్కలు మారతాయని విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.