
Vishaka garjana rally
విశాఖ గర్జనకు కౌంట్ డౌన్ మొదలైంది. ఉత్తరాంధ్ర తీరంలో ఉద్యమ అల విరుచుకుపడనుంది. వికేంద్రీకరణ నినాదంతో ఉత్తరాంధ్ర పొలికేక పెట్టనుంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వికేంద్రీకరణే లక్ష్యంగా భారీ ర్యాలీ జరగనుంది. ఉత్తరాంధ్ర ఆకాంక్షను వెలుగెత్తి చాటే ఈ సందర్భంలో భాగమయ్యేందుకు భారీ ఎత్తున జనం తరలిరానున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే ఈ ర్యాలీకి పూర్తి మద్దతు ప్రకటించింది. విశాఖ గర్జనకు పోటాపోటీగా జనసేన, టీడీపీ కూడా కార్యక్రమాలు చేపట్టనుండటంతో విశాఖలో రేపటి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
వికేంద్రీకరణకు మద్దతుగా 50 వేల మందితో బైక్ ర్యాలీ.. :
రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే ఉంది. వికేంద్రీకరణ ద్వారా విశాఖ రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర రాత మారే అవకాశం ఉంది. అందుకే ఉత్తరాంధ్ర జనం వికేంద్రీకరణ కోసం బలంగా నిలబడుతున్నారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలు, కుయుక్తులను బద్దలుకొట్టాలంటే… తమ ఆకాంక్షను వెలుగెత్తి చాటడమే సరైన మార్గమని భావిస్తున్నారు. అందుకే రేపటి విశాఖ గర్జన ర్యాలీలో భాగమయ్యేందుకు ఉత్తరాంధ్ర గ్రామాలన్నీ స్వచ్చందంగా కదిలి వస్తున్నాయి. కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాదు వికేంద్రీకరణకు మద్దతుగా నిలబడే ప్రతీ ఒక్కరూ రేపటి విశాఖ గర్జనలో పాల్గొననున్నారు. విశాఖ గర్జనలో భాగంగా నగరంలోని ఎల్ఐసీ కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్కే బీచ్ వరకు భారీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరగనుంది. 50 వేల మందితో ఈ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ర్యాలీ పొడవునా వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేయనున్నారు. వికేంద్రీకరణ ఆకాంక్షను చాటేలా ప్లకార్డులు ప్రదర్శించనున్నారు. అలాగే, ఉత్తరాంధ్ర సంస్కృతిని చాటే కళారూపాల ప్రదర్శన చేపట్టనున్నారు.
అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి సూటి ప్రశ్న :
అమరావతి అభివృద్ధిని తాము వ్యతిరేకించట్లేదని… కానీ అమరావతి పాదయాత్ర పేరిట ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ.. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దనే దురుద్దేశం పనికిరాదని అంటున్నారు. తమ ఆకాంక్షను వ్యతిరేకిస్తూ అమరావతి-అరసవెల్లి చేపట్టిన యాత్రను అడ్డుకుంటామని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని గుర్తించిన జగన్ సర్కార్ విశాఖపట్నంను రాజధానిగా చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గుర్తించిందని జేఏసీ కో కన్వీనర్ దేముడు పేర్కొన్నారు. విశాఖలో పరిపాలనా రాజధానిని వ్యతిరేకిస్తూ జరుగుతున్న పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలంతా ఖండించాలన్నారు. ఉత్తరాంధ్ర గడ్డపై వికేంద్రీకరణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో.. అమరావతి యాత్రికులకు ఇక ఉత్తరాంధ్రలో దారులు మూసుకుపోయినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.
జనసేన, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు :
వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జనమంతా కదులుతున్న వేళ.. దాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన, టీడీపీ అదేరోజు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే హడావుడిగా ఈ రెండు పార్టీలు.. అదే రోజున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. జనసేనాని పవన్ కల్యాణ్ 15న విశాఖలో అడుగుపెడుతున్నారు. ఆరోజు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జనసైనికులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించవచ్చుననే ప్రచారం సాగుతోంది. వికేంద్రీకరణకు మద్దతుగా సాగే ర్యాలీ నుంచి ప్రజా దృష్టి మళ్లించేందుకే పవన్ ఈ హడావుడి చేయబోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులతో విశాఖలో సమావేశం నిర్వహించనుంది. ఉత్తరాంధ్ర పట్ల వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం, వనరుల దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఓవైపు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్న వేళ… జనసేన, టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని జేఏసీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. వారు ఉత్తరాంధ్ర ద్రోహులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడుతున్నారు.