
sachivalayam
- మహాత్ముడి గ్రామ స్వరాజ్య ఆకాంక్ష సాకారం
వైసీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక రీతిలో శ్రీకారం చుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లుగా ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. నాడు–నేడుతో మారుమూల పల్లెల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు పేదల ఇళ్లలో వెలుగును నింపుతున్నాయి. డిజిటల్ లైబ్రరీలతో ఎంతో మంది యువతీ యువకులు సొంతూళ్ల నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. కేవలం మూడేళ్లలోనే మన కళ్లెదుటే ఇలా ఎన్నో అనూహ్య మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా 4.70 కోట్ల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతగా లబ్ధి కలిగించిందనేది అంచనాలకు అందనిది.
గడప వద్దకే పెన్షన్
అవ్వాతాతలు పింఛను కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు పింఛను డబ్బులు తీసుకోవడానికి పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పేదలెవరూ పైరవీ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి పని ఉన్నా ఊరు దాటి మండలానికో, పట్టణానికో వెళ్లాల్సిన పని అంతకంటే లేదు.
4 లక్షల ఉద్యోగాలు భర్తీ
కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా వాటిని భర్తీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పే– స్కేళ్లు అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా అందజేస్తున్నారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం ద్వారానే ప్రభుత్వం నాలుగు లక్షల కుటుంబాలకు ఉద్యోగావకాశాలను కల్పించింది.
పల్లెపల్లెలో అపూర్వ ‘స్పందన’
మూడేళ్ల క్రితం వరకు అసలు గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతం లేని గ్రామాలు ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఒక్కో గ్రామంలో పది మంది పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. రైతులకు వ్యవసాయ సలహాలిచ్చేందుకు వ్యవసాయ అసిస్టెంట్, పశువులకు వైద్యం చేసేందుకు మరో ఉద్యోగి, విద్యుత్ అంతరాయాలను వెంటనే సరిచేయడానికి ప్రతి గ్రామానికీ ఓ ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రతి రోజూ సాయంత్రం 3–5 గంటల మధ్య ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
గ్రామాల్లో డిజిటల్ సేవలు
మూడేళ్లకు ముందు రాష్ట్రంలో మూడొంతుల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కంప్యూటర్లు కూడా లేవు. ఇప్పుడు ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి కొత్తగా రెండేసి కంప్యూటర్లు, యూపీఎస్, ఇతరత్రా ఫర్నిచర్‌ను అందజేసింది. సంక్షేమ పథకాలలో పూర్తి పారదర్శకత కోసం ఫింగర్ ప్రింట్, ఐరిష్ స్కానర్లను కూడా అందజేశారు. పింఛను కార్డు, ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు ప్రింటర్, లామినేషన్ మిషన్లను ఇచ్చారు. డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తులు ఆయా శాఖల వెబ్సైట్లలో నమోదు చేయడానికి ప్రతి సచివాలయానికి ఇంటర్ నెట్ వసతిని కూడా కల్పించారు. రాష్ట్రంలో కుగ్రామంలో ఉండే సచివాలయంలో కూడా ఇప్పుడు డిజిటల్ సేవలే సాగుతున్నాయి.
మూడేళ్లల్లో 4.70 కోట్ల సమస్యల పరిష్కారం
ఈ మూడేళ్లల్లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 4.70 కోట్ల వినతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో 10.50 లక్షల మంది ఆధార్ సేవలను కూడా వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బీమాకు సంబంధించి 8.93 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సచివాలయాల ద్వారానే ఈ– శ్రమ్ కార్డులను అందజేశారు.
యూనిసెఫ్ నుంచి ప్రశంసలు
రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలను యూనిసెఫ్ ప్రశంసించింది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా యూనిసెఫ్‌కు చెందిన యూఎన్ వలంటీర్ల విభాగం ప్రతినిధుల బృందం కూడా పని చేస్తుండటం విశేషం. ఈ విధానం అమలుపై జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన రాష్ట్రంలో పర్యటించి.. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి.