
tirupati rally
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో తిరుపతి వేదికగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు జనం భారీగా తరలివచ్చారు. రాయసీమ హక్కులను కాపాడాలంటూ.. నినాదాలు చేశారు.
కృష్ణాపురం, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా ఈ మహా ప్రదర్శన సాగింది. ప్రదర్శనలో.. రాయలసీమ అన్ని జిల్లాల నుంచి తరలివచ్చారు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి.
ప్రదర్శన సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ అభివర్ణించారు. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదన్నారు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు అని ఆయన అభిప్రాయ పడ్డారు. వికేంద్రీకరణతోనే అని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు.