
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan)పై కేసు నమోదైంది. తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు రావటంతో ఈ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పవన్ కల్యాణ్ జాతయ రహదారిపై కారు టాప్ పైకెక్కి ప్రయాణించడంపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో పోలీసులు చట్టప్రకారం కేసు నమోదు చేశారు.

అయితే ఇప్పటం పర్యటన అసలు ఉద్దేశం వేరైతే.. పవన్ కల్యాణ్ రోడ్ షో చేసుకుంటూ వెళ్లడంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఇప్పటం గ్రామస్థుల ఇళ్లు కూల్చివేస్తోందంటూ వారికి మద్దతుగా నిలిచేందుకు పవన్ వెళ్లారు. అక్కడ బాధితులకు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్దికంగా సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇప్పటం వెళ్లే ముందు పోలీసులు అక్కడ పవన్ ను అడ్డుకొనే ప్రయత్నం చేసారు. దీనికి ఆగ్రహించిన పవన్ కల్యాణ్ పోలీసుల పైన మండిపడ్డారు. తొలుత పాదయాత్రగా బయల్దేరి..ఆ తరువాత తన కారు పైకి ఎక్కి కూర్చొని ఇప్పటం వెళ్లారు. ఇలా కారు టాప్ పైకి ఎక్కి కూర్చోవటం..పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న కారు రాష్ డ్రైవింగ్ వంటి వాటి పైన తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు.
దీంతో, తాడేపల్లి పోలీసులు పవన్‌పై IPC 336, రెడ్‌విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పవన్ తో పాటుగా ఆయన కారు డ్రైవర్ పైనా కేసు నమోదైంది. హైవేపై పవన్ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ జగనన్న కాలనీల సోషల్ ఆడిటింగ్ కోసం విశాఖలో ఉన్నారు. రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.