
ఆంధ్రప్రదేశ్ అనేక ఆలయాలకు శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడ శైవం, వైష్ణవం విరాజిల్లాయి. అనాది కాలం నుంచి ఈ రెండింటికి ఆదరణ ఉంది. శ్రీశైలం, తిరుపతి, అహోబిలం, కాణిపాకం లాంటి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీశైలం..
కర్నూలు జిల్లాలో నల్లమల కొండలలో ఉన్న చిన్న పట్టణం శ్రీశైలం. ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఇక్కడ కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది హిందూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.
తిరుపతి..
తిరుపతికి దగ్గరలో ఉన్న కొండ ప్రదేశమే తిరుమల. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇది ఎదవ శిఖరంగా పిలువబడే వెంకటాద్రి కొండ పై ఉంది. తూర్పుకొండల దిగువ భాగంలో ఉన్న ప్రదేశం తిరుపతి. ఇది నిత్యం వెంకటేశ్వర స్వామి వేడుకలతో భక్తి పారవశ్యంతో నిండిపోతుంది.
శ్రీకాళహస్తి..
చిత్తూరు జిల్లా, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో శ్రీకాళహస్తి ఉంటుంది. ఇది గొప్ప శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలతో ఒకటి ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది.
అహోబిలం..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో అహోబిలం ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ వైష్ణవ క్షేత్రం చుట్టూ నల్లమల అడవులు, ప్రకృతి అందాలు, హోరెత్తించే జలపాతాలు, నదులు ఉన్నాయి. ఈ ప్రదేశం భక్తులనే కాక, పర్యాటకులను ఆకర్షిస్తోంది.
అన్నవరం..
తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం ఉంటుంది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఇక్కడి రత్నగిరి అనే కొండ పై కొలువై ఉన్నాడు. కార్తీక మాసంలో ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటం ఇక్కడ ప్రత్యేకత.
కాణిపాకం..
చిత్తూరు జిల్లాలో కాణిపాకం ఆలయం ఉంది. ఇక్కడ వినాయక స్వామి కొలువుదీరాడు. సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామి కి వేల ఏళ్ల చరిత్ర ఉంది.
లేపాక్షి..
అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక ప్రదేశం లేపాక్షి. శివుడు, మహా విష్ణువు, వీరభద్ర స్వామికి సంబంధించిన మూడు ఆలయాలు ఇక్కడ కొలువుదీరాయి. రాతి గోడలపై చెక్కిన అద్భుత శిల్పకళా వైభవం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.