
కోనసీమ.. ఆ పేరు వింటేనే పచ్చటి ప్రకృతి మన కళ్ల ముందు మెదులుతుంది. కోనసీమలో సుమారు 50 కిలోమీటర్లకుపైగా సముద్ర తీర ప్రాంతం ఉంది. అక్కడ ఉన్న బీచ్‌లు జిల్లాకు ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. తీర ప్రాంతాల్లోని ఆ బీచ్‌లన్నీ పర్యాటకులతో నిత్యం సందడిగా ఉంటున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా వేలాది మంది బీచ్‌లకు తరలి వస్తున్నారు. కోనసీమలో పాపులర్ బీచ్‌లు ఓడలరేవు, కొమరగిరిపట్నం, కేశనపల్లి, కేశవదాసుపాలెం, చింతలమోరి, అంతర్వేది, ఎస్.యానాం, చిర్రయానాం, బ్రహ్మసమేథ్యం. వీటిలో చాలా వరకు లోకల్ వారికే కాక పొరుగు రాష్ట్రాల వారికీ పర్యాటక గమ్యస్థానంగా ఉంది. కోనసీమ జిల్లాలో మరో పర్యాటక ఆకర్షణ ఉన్న ప్రాంతం ఆత్రేయపురం. ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తొస్తాయి. అదే మండలం బొబ్బర్లంక శివారులో ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో ఉన్న పిచ్చికలంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. అక్కడ ఉన్న కొన్ని రిసార్టులను మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తే మరింత ఆకట్టుకుంటాయి. వశిష్ట నది చెంతన మలికిపురం మండలం దిండిలో కేరళ తరహాలో ఉన్న హౌస్బోట్లు ద్వారా నదీ విహారాలు సాగించవచ్చు. దిండి రిసార్ట్స్ లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతిగదులతో పాటు నాలుగు హౌస్బోట్లు, ఒక వశిష్టబోటు, స్పీడు బోట్లు ఉన్నాయి. యానాం నుంచి బోట్ల ద్వారా సాగర సంగమ విహారం, బోడసకుర్రు, సోంపల్లి, అంతర్వేది, సఖినేటిపల్లి, ఎదుర్లంక, మురమళ్ల, దిండి, కోటిపల్లి, వివిధ నదీ పరివాహక ప్రాంతాల్లో బోటు షికార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాట్రేనకోన మండలం కందికుప్ప, తాళ్లరేవు మండలం కోరంగి నుంచి మడ అడవుల్లో పడవల ద్వారా విహారయాత్ర సాగించవచ్చు.