
పారదర్శక సేవలందిస్తున్నందుకు గుర్తింపు | దేశంలో మొట్టమొదటిసారిగా..
విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ఐఎస్వో గుర్తింపునకు ఎంపికైంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్వో) గుర్తింపు అంటే గొప్ప పేరు. ఆ గుర్తింపు తెచ్చుకోవడం అంత తేలికేం కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఐఎస్వో కొన్ని గుర్తింపు ప్రమాణాలు నిర్దేశించింది. వాటిని అందుకున్న వాటికే ఐఎస్వో గుర్తింపు లభిస్తుంది. సాధారణంగా కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలకు ఈ గుర్తింపునివ్వడం జరుగుతుంది. అరుదుగా విద్యా సంస్థలు వంటి వాటికి గుర్తింపునిస్తుంది.
పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకుగాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. ఐఎస్వో ఏపీ, తెలంగాణ ఇన్చార్జి శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం జూలైలో ఎన్టీఆర్ వర్సిటీని సందర్శించింది. ఆ కమిటీ పలు విధానాలపై అధ్యయనం చేసింది. మెడికల్‌తో పాటుగా ఆయుష్, పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్న తీరును పరిశీలించింది.
విశ్వవిద్యాలయంలో అందుతున్న సేవలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసింది. వర్సిటీ పరిధిలో పరీక్షల నిర్వహణ ఎలా చేపడుతున్నారో అధ్యయనం చేసింది. అకడమిక్ విధానంలో పారదర్శక సేవలు అందడం చూసి నోట్ చేసుకుంది. పరీక్షల నిర్వహణలో అవలంబిస్తున్న విధానాలను పరిశీలించింది. వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని ఐఎస్వో సర్టిఫికేషన్ అందించాలని నిర్ణయించింది.
మన దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికీ ఈ గుర్తింపు దక్కలేదు. మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌కే, అదీ విజయవాడకు అంత గొప్ప సర్టిఫికేషన్ రావడంపై పలు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో ఐఎస్వో ఏపీ, తెలంగాణ ఇన్చార్జి శివయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డా. శ్యామ్ ప్రసాద్ ఈ గుర్తింపు పత్రాన్ని అందుకోనున్నారు.