
శీల పరీక్షకు సిద్ధం కావాలని పిలుపు | ముగింపు లేని వీడియో రాజకీయం
వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారానికి ఇప్పట్లో ముగింపు పడేలా కనిపించడం లేదు. వీడియో వెలుగు చూసిన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష విమర్శలు, కౌంటర్లకు అంతే లేదు. తాజాగా సీఐడీ చీఫ్ ఆ వీడియోపై టీడీపీ చూపిస్తున్న రిపోర్ట్ ఫేక్ అని ప్రకటించారు. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల సవాల్ విసిరారు. కాణిపాకం వినాయకుడి వద్ద శీల పరీక్షకు సిద్ధం కావాలన్నారు. ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని చేసే ప్రచారం నిలబడదన్నారు.
వీడియో ఫేక్.. రిపోర్ట్ ఫేక్
ఫేక్ వీడియోతో టీడీపీ చేస్తున్నది అనవసర రాద్ధాంతమని ఎంపీ చెబుతున్నారు. అమెరికా నుంచి తీసుకొచ్చిన ఫోరెన్సిక్ నివేదిక కూడా ఫేక్ అని తేలిపోయిందన్నారు. చివరికి ఫోరెన్సిక్ రిపోర్టును కూడా మార్ఫింగ్ చేసి దొంగలు దొరికిపోయారని ధ్వజమెత్తారు. వీడియోపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మనస్ఫూర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనిపై అధికార పార్టీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీ నేతలూ కౌంటర్ల మీద కౌంటర్లిస్తున్నారు. మొత్తానికి ఫేక్ వీడియో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పట్లో దానికి ముగింపు పడేలా కనిపించడం లేదు.