
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామాన్ని సందర్శించి, నష్టపోయిన అరటి తోటలు పరిశీలించారు. బాధిత రైతులను కలిసి వారి సమస్యలను స్వయంగా విన్నారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా, ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
రైతులకు అందాల్సిన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు నిర్లక్ష్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రూ. 25 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీ రైతులకు ప్రయోజనం కలిగించేదని, కానీ ప్రభుత్వం యూజర్ ఏజెన్సీకి అప్పగించకపోవడంతో రైతులకు నష్టం జరిగింది.
ఉచిత పంట బీమా, సున్నా వడ్డీ రుణాలకు ఎండ్ కార్డు
రైతులను ఆదుకునేందుకు ఉచిత పంట బీమా అమలు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అంతేకాదు, సున్నా వడ్డీ రుణాలను కూడా రద్దు చేయడంతో రైతులపై ఆర్థిక భారం పెరిగిందని అన్నారు.
పంట ధరలు కుప్పకూలినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు
అరటి ధర గతంలో రూ. 26,000 నుంచి రూ. 9,000కి, ఆ తర్వాత రూ. 6,000కి పడిపోయింది. అయినా, ప్రభుత్వం స్పందించడం లేదని జగన్ ఆరోపించారు. బత్తాయి, మిర్చి, ధాన్యం వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను విస్మరించిందన్నారు.
వైఎస్ జగన్ భరోసా: రైతులకు పరిహారం వచ్చేలా పోరాటం
అకాల వర్షాల వల్ల దాదాపు 4,000 ఎకరాల్లో పంట నష్టపోయిందని ప్రాథమిక అంచనాగా పేర్కొన్న వైఎస్ జగన్, ఈ నష్టానికి ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు తగిన న్యాయం జరిగేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నిరకాల ప్రయత్నాలు చేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు.