
హైదరాబాద్: నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారం పై ప్రముఖ సినీ నటులు, టీవీ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా 25 మంది పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, టీవీ యాంకర్లు శ్యామల, శ్రీముఖి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, సిరి హనుమంతు తదితరులు ఉన్నారు.
కేసు వివరాలు:
మియాపూర్‌కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్రశర్మ ఫిర్యాదు మేరకు, బీఎన్ఎస్ 318(4), 112, 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(ఏ), 4, ఐటీ చట్టం 66డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు “సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భారీ పారితోషికాల కోసం నిషేధిత యాప్‌లకు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. బెట్టింగ్ కారణంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు” అని ఆరోపించారు.
సెలెబ్రిటీల స్పందన:
నటుడు ప్రకాశ్ రాజ్ దీనిపై స్పందిస్తూ, 2016లో ఓ గేమింగ్ యాప్‌కు ప్రచారం చేసిన మాట నిజమే కానీ, తప్పుడు యాప్ అని తెలుసుకుని 2017లో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా అని వివరణ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి పీఆర్ బృందాలు మాట్లాడుతూ, తాము నైపుణ్య ఆధారిత గేమింగ్ యాప్‌లకు మాత్రమే ప్రచారం చేశామని, అనుమతులు లేని ఏ యాప్‌కీ ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. విజయ్ ఒప్పందం గతేడాదే ముగిసిందని, రానా ఒప్పందం 2017లోనే పూర్తయిందని తెలిపారు.
విచారణకు హాజరైన యాంకర్లు:
ఈ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా టీవీ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై FIR నమోదైంది. ఇప్పటికే యాంకర్లు విష్ణుప్రియ, రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మరిన్ని నిందితులను త్వరలో విచారణకు పిలిపించనున్నట్లు సమాచారం.