
minister buggana rajendranath reddy satires on tdp janasena alliance
ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందంటూ ఇటీవల వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… టీడీపీతో మళ్లీ దోస్తీకి సిద్ధమైపోయారు. చంద్రబాబు-పవన్ భేటీతో ఇరు పార్టీలు పొత్తు దిశగా అడుగులేస్తున్నాయనే విషయం స్పష్టమైపోయింది. ఈ పొత్తుపై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రెండు పార్టీల పొత్తుపై సెటైర్లు సంధించారు.
టీడీపీ-జనసేన మధ్య పెళ్లిళ్లు, విడాకులు సహజమే అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ‘ఈ రెండు పార్టీల మధ్య ఎన్నిసార్లు పెళ్లిళ్లు జరిగాయి… ఎన్నిసార్లు విడాకులయ్యాయి.. ఒకే పార్టీతో ఎన్నిసార్లు కలుస్తారు.. ఒక్క వైసీపీతో తప్ప ఇప్పటివరకూ టీడీపీ కలవని, పొత్తు పెట్టుకోని పార్టీ లేదు. ‘ అంటూ బుగ్గన విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఒక సిద్దాంతమంటూ లేదని… పాలసీలో నిలకడ లేదని అన్నారు. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు, వాడిన భాష అందరికీ తెలుసన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఓపిక ఉండాలని… పవన్ వైసీపీపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.
అసమానతలు తొలగించేందుకే వికేంద్రీకరణ : మంత్రి బుగ్గన
మూడు రాజధానులతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి బుగ్గన అన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు ఏర్పడ్డాయని.. వాటిని తొలగించేందుకే అభివృద్ధి వికేంద్రీకరణ అని పేర్కొన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ నంబర్ 1 స్థానం లో ఉందన్నారు. 2019లో ఎగుమతుల్లో ఏపీ దేశంలో 7వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉందన్నారు. దేశంలో పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉందని.. ఇప్పటివరకూ రాష్ట్రానికి రూ.13,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఇదే విషయాన్ని గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పామని, అప్పుల విషయం ఏనాడు దాచలేదని అన్నారు.