
ysrcp janasena
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా రాజోలులో మరీ ఆసక్తికరంగా మారింది. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైసీపీకి మద్దతుగా నిలవడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే గత ఎన్నికల్లో రాపాక వర ప్రసాద్ పై పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
వాస్తవానికి కొంతకాలంగా బొంతు రాజేశ్వర రావు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనడటం లేదు. ఒక దశలో ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బొంతు రాజేశ్వర రావు.. పవన్ కల్యాణ్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.
కారణం ఇదేనా..
2014, 2019లో ఎన్నికల్లో పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. నామినేటెడ్ పోస్టు ఇచ్చారు జగన్. ఈ క్రమంలో జనసేన నుంచి గెలిచిన వరప్రసాద్.. వైసీపీకి దగ్గరయ్యారు. రాపాక వైసీపీకి దగ్గరవడాన్ని బొంతు వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బొంతు.. నామినేటెడ్ పదవి కూడా పోయింది. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా అమ్మాజీ నియామకం అయ్యారు. దీంతో పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన బొంతు రాజేశ్వర రావు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేనలో చేరడం ఇక ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే.. ఇన్నాళ్లు వైసీపీకి బయట నుంచి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే వర ప్రసాద్.. అధికారికంగా వైసీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బలహీనత అదే?
మొదట్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన బొంతు రాజేశ్వర రావు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కావాల్సిన డైనమిక్స్ ఆయనలో లేవనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఆయన వ్యక్తిగతంగా మంచి వారు. సాఫ్ట్ ఉండే గుణం. అయితే సాఫ్ట్ గా ఉండే గుణం సమకాలిన ఏపీ రాజకీయాల్లో సరిపోదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెతక వైఖరి ఆయనకు మైనస్ గా మారిందనే ప్రచారం జరుగుతోంది.
రాజోలు నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న.. బొంతు రాజేశ్వర రావు – ఎమ్మెల్యే వర ప్రసాద్ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరి స్థాన చలనం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.