
polavaram KVP
పోలవరం ప్రాజెక్ట్ ఒక మహాయజ్ఞం. అఖిలాంధ్ర రైతులకు సాగునీటి లోటు లేకుండా చేసేందుకు మాజీ సీఎం వైఎస్సార్ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్. డిసెంబర్ 2013 నాటికి పూర్తి చేయాలని భావించిన వైఎస్సార్ మరణించడంతో జాప్యం జరుగుతూనే ఉంది. ఈ జాప్యానికి రాజకీయాలే కారణమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే దీని నిర్మాణం పూర్తి అయిపోయేదని, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
“జలయజ్ఞం- పోలవరం- ఒక సాహసి ప్రయాణం“ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
“పోలవరం విషయంలో పార్లమెంట్ చేసిన చట్టం సరిగ అమలుకాలేదు. ఈ ప్రాజెక్ట్ వైఎస్సార్ కల. దీనిని సాకారం చేయడం కోసం 2020 వరకూ రాజ్యసభలో పోరాటం జరిపా. ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా రాజ్యసభలో ప్రైవేట్ బిల్ కూడా పెట్టాను. ఓటింగ్‌కు ముందు దానిని ఫైనాన్స్ బిల్ అని పేర్కొనేసరికి అప్పటి ఫైనాన్స్ మినిష్టర్ అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. ఎప్పటికైనా ప్రాజెక్ట్ పూర్తయితే ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయనే ఆశిస్తున్నా” అని వెల్లడించారు.
కార్యక్రమానికి హాజరైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జర్నలిస్ట్ కృష్ణారావు, సీపీఐ నారాయణ, మాజీమంత్రి రఘువీరా రెడ్డి మాట్లాడగా, కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్ వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు.
“ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఓ మైలురాయి . వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు అంకురార్పణ జరిగింది. విభజన తరువాత ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేవీపీ అలుపెరగకుండా పోరాడుతున్నారు. ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా ఉండేందుకే ముంపు గ్రామాలను ఇందులో కలిపాం“
– కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్
“ప్రాజెక్టు నిర్మాణానికి అసలైన అడ్డంకి మోదీ మాత్రమే. పోలవరానికి బదులు శ్రీరామ్పాద సాగర్ అని పేరుంటే ఎప్పుడో పూర్తి చేసేవారేమో“
– జర్నలిస్ట్ కృష్ణారావు.
“మేం చేసేది మేం చేస్తాం.. మీరు చేసేది మీరు చేయండి అని వైఎస్సార్‌కు చెప్పాం“
– సీపీఐ నారాయణ
“రక్తంలేని మనిషి, నీళ్లు లేని సేద్యం ఒక్కటే“
– మాజీ మంత్రి రఘువీరా రెడ్డి
“ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని అనుమతులు కోసం ఎదురుచూస్తూ ఉంటే వెయ్యేళ్లు అయినా పూర్తి కాదు. ఇప్పుడే ప్రాజెక్ట్ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం లేదు“
– జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం యొక్క తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుందని అంచనా. అంతేగాకుండా, విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్ళించే బృహత్ పథకం “గంగా – కావేరి నదుల అనుసంధానం”లో పోలవరం పథకం ఒక భాగం.