
85 years for sri bagh pact know why rayalaseema demanding to implement this agreement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఎనిమిదేళ్లలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ అమరావతిని రాజధానిగా తెరపైకి తెచ్చింది. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును, శ్రీబాగ్ ఒడంబడికను అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు, శ్రీబాగ్ ఒడంబడికకు కట్టుబడి వికేంద్రీకరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. అదే సమయంలో వికేంద్రీకరణ వ్యతిరేక శక్తులు దాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా ఏపీ రాజకీయం సాగుతోంది. ఈ సందర్భంలో శ్రీబాగ్ ఒడంబడికకు నేటితో 85 ఏళ్లు పూర్తవడం.. ఆ ఒప్పందం అమలు కోసం రాయలసీమ ప్రజలు నినదిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేంటీ శ్రీబాగ్ ఒడంబడిక :
తమిళ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ముందుకొచ్చిన తరుణంలో శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఒకవేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆంధ్ర-రాయలసీమ ప్రాంతాల మధ్య ఎలాంటి సర్దుబాటు జరగాలన్నదే ఈ ఒడంబడిక ముఖ్య ఉద్దేశం. స్వాతంత్య్రానికి పదేళ్ల పూర్వమే నవంబర్ 16, 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసంలో ఇరు ప్రాంతాల పెద్ద మనుషుల మధ్య ఈ ఒప్పందం జరిగింది. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసం’శ్రీబాగ్ మహల్’ కావడంతో.. ఈ ఒప్పందానికి అదే పేరు వచ్చింది. ఒప్పందం ప్రకారం.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగితే పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, ఆంధ్రా యూనివర్సిటీ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు కావాలి. రాయలసీమలో రాజధాని ఏర్పడితే ఆంధ్రాలో హైకోర్టు, లేదా ఆంధ్రాలో రాజధాని ఏర్పడితే రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాయలసీమ ఆకాంక్షకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ ఒప్పందం ప్రకారమే 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గుంటూరులో హైకోర్టు, రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో రాజధాని ఏర్పడింది. కానీ 1956లో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో విలీనమవడంతో రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్కు తరలిపోయింది.
వైసీపీ పుణ్యమాని సీమ వాసుల్లో ఆశలు :
అప్పట్లో రాజధానిని కోల్పోయిన రాయలసీమ వాసుల్లో వైసీపీ ప్రభుత్వ పుణ్యమాని న్యాయ రాజధాని పట్ల ఆశలు చిగురించాయి. అందుకే ‘ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పటికీ జరగదు’ అంటూ సీమ వాసులు పోరు బాట పట్టారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ఆత్మగౌరవ మహా ప్రదర్శన, కర్నూలులో నిర్వహించిన మిలియన్ మార్చ్ ద్వారా న్యాయ రాజధాని పట్ల తమ ఆకాంక్షను చాటారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలుచేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధానిని కోల్పోయి చరిత్రలో ఒకసారి భంగపడ్డ సీమ ప్రజలు ఈసారి ఎలాగైనా న్యాయ రాజధానిని సాధించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.