
- ప్రభుత్వ బడులకు పుర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా.. ప్రభుత్వ బడులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ బడులకు పుర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు జగన్. పేదల విద్య కోసం ఏకంగా 53వేల కోట్లు తన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు.
విజయవాడలో జగిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం విద్యారంగం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ప్రభుత్వ బడి కార్పొరేట్ బడి కంటే బాగుండాలన్న ఉద్దశంతో అనేక మార్పులకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. పేద పిల్లలు మాత్రమే కాకుండా.. మంచి చదువులు కావాలనుకునే తల్లితండ్రులు, సర్కారు బడులలో పనిచేస్తున్న టీచర్లు సైతం వారి పిల్లలను ప్రభుత్వ బడులలో చదివించే పరిస్థితి రావాలన్న మంచి సంకల్పంతో మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు.
సరైన టాయ్లెట్లు లేకపోవడం వల్ల ఆడపిల్లల్లో ఎక్కువశాతం బడి మానేస్తున్నారు అన్న నిజాన్ని తాము గనించినట్లు జగన్ పేర్కొన్నారు. వందశాతం అక్షరాస్యత, కనీసం అంటే 70శాతం ఉన్నత విద్యలో జీఈఆర్ రేషియో పెంచే లక్ష్యంగా నిర్దేశించుకొని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
అమ్మఒడి, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్ ఒప్పందంతో పాటు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు కూడా స్కిల్స్ అప్‌గ్రేడేషన్ ప్రొగ్రాం.. ఇలా ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేసిన.. చేస్తున్న ఖర్చు రూ.53 వేల కోట్లు అని వెల్లడించారు. ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఉపయోగపడే విధంగా నాణ్యమైన చదువు ఇవ్వాలన్నది విధానంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగం మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం తమదన్నారు.
ఉద్యోగుల కోసం చిత్తశుద్ధితో…
ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కూడా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు వైఎస్ జగన్. 60నుంచి 62 సంవత్సరాలకు ఎవరూ అడక్కపోయినా పదవీవిరమణ వయస్సును పెంచినట్లు గుర్తు చేశారు. ఎవరూ అడక్కపోయినా ఎస్జీటీలకు స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.