
botsa satyanarayana
గ్రంథాలయాల పూర్వవైభవానికి ఛైర్మన్లు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఛైర్మన్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతతో పని చేయాలన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్లు, కార్యదర్శులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ సీఎం జగన్ జగన్ గ్రంథలయాలను అభివృద్ధి చేయడంతోపాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ఉన్నారన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఉండేలా లైబ్రరీల రూపురేఖలు మార్చాలన్నారు.త్వరలో దాదాపు 4 వేల డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రతి గ్రామ/వార్డు సచివాలయానికి అనుసంధానంగా ఒక గ్రంథాలయం ఉండాలన్నది సీఎం ఆలోచన అని.. ఆ దిశలో తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని జిల్లా ఛైర్మన్లను కోరారు.
గ్రంథాలయాల అప్ గ్రేడేషన్ తో పాటు, మరమ్మత్తులు తదితర అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. లైబ్రరీల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని, ఛైర్మన్లు , కార్యదర్శులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు .
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రధానంగా విద్యార్థుల్లో చదివే జిజ్జ్ఞాస పెరిగేలా గ్రంథాలయాల ఛైర్మన్లు చొరవ చూపాలని న్నారు. పిలల్లు పోటీ ప్రపంచంలో నిలదొక్కునేలా చూడటంలో లైబ్రరీలు తొలి సాధనం కావాలని ఆయన సూచించారు. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కె.శేషగిరిరావు, గ్రంధాలయ విభాగపు డైరక్టర్ ప్రసన్న కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.