
ysr
ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారతే లక్ష్యంగా.. వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ అందిస్తోంది. మూడో విడత పంపిణీని చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించింది. తద్వారా జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళలకు రూ. 4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేసింది.
వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750 ల చొప్పున మహిళలకు వరసగా క్రమం తప్పకుండా నాలుగేళ్లలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందించి.. వారికి వారికి జీవనోపాధి మార్గాలను చూపించాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే శుక్రవారు మూడో విడత పంపిణీకి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం వేదికైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (శుక్రవారం జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేసినట్లు అవుతుంది.
అలాగే ఆసక్తి కనబరిచిన మహిళలకు సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందించి, కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకలు వంటి అనేక జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ వ్యాపార అవకాశాలు పెంచేందుకు దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో టైఅప్ చేయించి చేయూత అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పటి వరకు 5,82,662 మందికి వైఎస్సార్ చేయూత ద్వారా కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్నారు. వీరిలో 1.10 లక్షల మంది కిరాణా దుకాణాలు, 60,995 మంది వస్త్ర వ్యాపారం, 1,15,446 మంది ఇతర జీవనోపాధి, 2,96,221 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో రాణిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రతి మండలానికి ఒక వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతోంది.
పేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు, వారి జీవన స్థితిగతులు మెరుగు పడతాయన్న ఉద్దేశంతో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా 5,30,01,223 మందికి రూ.2,39,013.40 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు చెబుతోంది ప్రభుత్వం.