
cm ys jagan
- ‘గడప గడపకూ మన ప్రభుత్వం’వర్క్‌షాప్‌లో సీఎం జగన్
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో 19 నెలలు ఉన్నాయని, ఈ సారి 175 సీట్లకు 175 స్థానాలు గెలిచి తీరాలన్నారు సీఎం జగన్ . అందుకోసం అందరం కష్టపడి పనిచేయాలన్నారు. గడప గడపకూ తలెత్తుకుని వెళ్లే పరిస్థితి మనకు ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చక్కటి పరిపాలన ప్రజలకు అందించిందన్నారు. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగింది? ఎంత మేలు జరిగింది? ఏ స్కీములందాయి? అన్న జాబితాలను తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటంబానికి ఏదో ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం లబ్ధి చేకూరిందన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు.. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో సీఎం జగన్ మాట్లాడారు.
ఇప్పటి వరకు 98.4 శాతం హామీలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను చేరవేసినట్లు వివరించారు. ‘ఇచ్చిన హామీలు నెరవేర్చాం, మీ ఇంటికి మేలు చేశాం, ఆశీర్వదించండి’ అని దేశరాజకీయ చరిత్రలో ఇలా ప్రజలముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వ తమదే అన్నారు సీఎం జగన్. ఇంతటి సానుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
“ఒక సచివాలయానికి (గ్రామం) వెళ్లినప్పుడు 100 శాతం ఇళ్లు పూర్తి చేయడం తప్పనిసరి. అలా చేయకపోతే దానివల్ల నష్టం జరుగుతుంది. ఒకసారి మనం గ్రామ సచివాలయానికి వెళ్తే ఎన్ని రోజూలైనా సరే మొత్తం అన్ని ఇళ్లకూ వెళ్లాలి. గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తిచేయాలి. మనం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులు ఇస్తున్నాం ” – సీఎం జగన్
గతంలో పోలిస్తే పురోగతి..
మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పురోగతి బాగుందన్నారు సీఎం జగన్. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవని, ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ సారి ఒక్క సీటు కూడా మిస్కాకూడదన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే గడప గడపకూ రూపంలో చక్కటి ప్రణాళిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ మంచి చేశామని లెటర్ కూడా తీసుకుని వెళ్తున్నామని, దీనికి స్పందనగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు.
మనల్ని మనం గెలిపించుకోవడ కోసమే గడప గడపకూ కార్యక్రమం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు సీఎం జగన్. మనకు మనంగా చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో షార్ట్‌కట్స్ ఉపయోగిస్తే నష్టపోయేది మనమే అన్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలలో కనీసం 16 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
కొందరు తమ గ్రేడ్ పెంచుకోవాల్సి ఉందన్నారు వైఎస్ జగన్. ప్రతి ఒక్కరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఎవరినీ పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. వారి గ్రేడ్ పెంచడమే తన లక్ష్యం అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు సర్వే చేయిస్తానని, ప్రజాదరణ ఉంటేనే మళ్లీ టికెట్లు ఇస్తానన్నారు జగన్. తిరిగి డిసెంబరులో మొదటి రెండు వారాల్లో సమావేశం అవుదామన్నారు.
“రాజకీయం అనే జీవితాన్ని మనం ఎంచుకున్నాం. దానికోసం ఇది చేస్తున్నాం. ఎమ్మెల్యేలుగా ఎన్నికై మళ్లీ గెలుచుకుని రావడం అన్నది.. ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతుంది. అందుకనే ఈ కార్యక్రమం. ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు తిరిగి ఓడిపోతే గౌరవం తగ్గుతుంది. దేవుడి దయవల్ల మనకు అలాంటి పరిస్థితి లేదు. మనం కష్టపడితే చాలు, తిరిగి గెలుచుకుని రాగలుగుతాం. మన పాలనద్వారా ప్రజలకు మంచి చేయగలిగిన కార్యక్రమాలన్నీ చేపట్టాం. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారికి మనం జవాబుదారీ తనంగా ఉన్నాం. 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మిస్‌కాకూడదు. దానికోసం అందరూ కష్టపడదాం”– సీఎం జగన్